Skip to main content

సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి

సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి

మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సామాజిక శంఖారావం బృందం వినతి

అమరావతి: “సామాజిక శంఖారావం – కులవివక్ష లేని సమాజం కోసం” నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సామాజిక శంఖారావం ప్రతినిధి బృందం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని మంగళవారం కలిసి రాష్ట్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది.

రాష్ట్రంలోని 26 జిల్లాలు, 380 మండలాలు, 1,243 గ్రామాలు, 63 పట్టణాలు, 236 వార్డుల్లో నిర్వహించిన అధ్యయన యాత్రల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ అధ్యయనంలో 660 స్మశాన వాటిక సమస్యలు, 405 ఇళ్ల స్థలాల సమస్యలు, 302 భూ సంబంధిత సమస్యలను గుర్తించినట్లు తెలిపారు.

స్మశాన వాటికలకు శాశ్వత పరిష్కారం

అధ్యయన యాత్రల్లో అత్యధికంగా వెలుగులోకి వచ్చిన సమస్య స్మశాన వాటికలేనని ప్రతినిధులు తెలిపారు. అనేక దళితవాడల్లో ప్రత్యేక స్మశాన స్థలాలు లేకపోవడం, ఉన్న భూములు ఆక్రమణలకు గురికావడం, స్మశాన వాటికలకు రహదారులు లేకపోవడం, విద్యుత్, మంచినీరు, ప్రహరీ, స్నానపు గదులు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం వంటి సమస్యలను వివరించారు.

జీవో 1235 ప్రకారం ప్రతి దళితవాడకు స్మశాన వాటిక ఏర్పాటు చేసి, ఆక్రమణలకు గురైన స్మశాన భూములను స్వాధీనం చేసుకుని అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

దళితుల భూములకు రక్షణ కల్పించాలి

దళితులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేకపోవడం, అసైన్డ్ భూములు ఆక్రమణలకు గురికావడం, భూములు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడం వంటి సమస్యలు అనేక ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు.

దళితుల భూములపై ప్రత్యేక సమగ్ర సర్వే నిర్వహించి అర్హులకు పట్టాలు ఇవ్వాలని, ఆక్రమణలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించాలని కోరారు. కోనేరు రంగారావు కమిషన్ సిఫారసుల ప్రకారం రాష్ట్రంలోని మిగులు భూములను భూమిలేని దళితులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణానికి సహాయం

అనేక దళితవాడల్లో కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేకపోవడం, పాత బీఫార్లకు శాశ్వత పట్టాలు ఇవ్వకపోవడం, గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని ప్రతినిధులు తెలిపారు.

అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఇంటి స్థలం, ఇంటి పట్టా ఇచ్చి, గృహ నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించాలి

దళితవాడల్లో తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధిలైట్లు, విద్యుత్, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను వినియోగించి పెండింగ్‌లో ఉన్న పనులను కాలపరిమితిలో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

కులవివక్ష, అంటరానితనాన్ని అరికట్టాలి

అధ్యయన యాత్రల్లో కొన్ని ప్రాంతాల్లో దేవాలయ ప్రవేశం, క్షవరం, టీ దుకాణాలు, సామాజిక ప్రదేశాలు, భోజనాల్లో వివక్ష వంటి ఘటనలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.

రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించినప్పటికీ ఇటువంటి ఘటనలు కొనసాగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కులవివక్షకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు రక్షణ కల్పించాలని కోరారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విద్య, హాస్టళ్లు, వైద్యం, ఉపాధిపై దృష్టి పెట్టాలి

దళితవాడల్లో మూసివేసిన పాఠశాలలను అవసరమైన చోట పునఃప్రారంభించాలని, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని కోరారు.

ఎస్సీ హాస్టళ్లలో శిథిల భవనాలకు మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త భవనాలు నిర్మించాలని, మెస్ చార్జీలు పెంచాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

చదువుకున్న దళిత యువతకు ఉపాధి కల్పించాలని, ఉపాధి హామీ పనుల్లో తగిన రోజులు పని కల్పించి పెండింగ్ కూలీ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.

మంత్రికి ప్రధాన డిమాండ్లు

- ప్రతి దళితవాడకు స్మశాన స్థలం, రహదారి, ప్రహరీ, మంచినీరు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించాలి.
- స్మశాన భూముల ఆక్రమణలను తక్షణమే తొలగించాలి.
- తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో లేదా ఛైర్మన్ పదవుల్లో దళితులకు అవకాశం కల్పించాలి. అన్ని దేవాలయాల్లో దళిత పూజారుల నియామకానికి చర్యలు తీసుకోవాలి.
- దళితుల సాగుభూములు, అసైన్డ్ భూములు, ఇళ్ల స్థలాలను రక్షించాలి.
- అర్హులైన దళితులకు భూమి, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి.
- దళితవాడల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, పారిశుద్ధ్య సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలి.
- దేవాలయ ప్రవేశం, క్షవరం, టీ దుకాణాలు, సామాజిక ప్రదేశాల్లో వివక్షకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- అవసరమైన చోట మూసివేసిన పాఠశాలలను పునరుద్ధరించాలి.
- అవసరమైన ప్రాంతాల్లో అంగన్‌వాడీలు, దళిత కాలనీల్లో ప్రభుత్వ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలి.
- ఉపాధి హామీ పనుల్లో దళిత కుటుంబాలకు వివక్ష లేకుండా పని కల్పించి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.
- దళిత, గిరిజన కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసి పంట రుణాలు అందించాలి.
- సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో గుర్తించిన ప్రతి సమస్యపై జిల్లా స్థాయిలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి కాలపరిమితితో కూడిన పరిష్కార చర్యలు చేపట్టాలి.

జిల్లా కలెక్టర్లకు అర్జీలు పంపించి పరిష్కారం చేస్తాం: మంత్రి

సామాజిక శంఖారావం బృందం సమర్పించిన నివేదికను పరిశీలించిన మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, క్షేత్రస్థాయిలో సమస్యలను సేకరించి నివేదిక అందించారని తెలిపారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఎస్సీ హాస్టళ్ల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే నిధులు కేటాయించి చాలా వరకు సమస్యలను పరిష్కరించామని, అవసరమైతే సంబంధిత హాస్టళ్లను స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని మంత్రి సూచించారు.

అధ్యయన యాత్రల్లో గుర్తించిన సమస్యలను జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లకు కూడా అర్జీలు ఇవ్వాలని సూచించారు. ఆగస్టు 24న అన్ని జిల్లా కలెక్టర్లకు అర్జీలు సమర్పించనున్నట్లు సామాజిక శంఖారావం ప్రతినిధులు తెలిపారు.

సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ప్రతినిధులు కోరారు.

ప్రతినిధి బృందంలో...

మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని కలిసిన వారిలో కొత్తపల్లి లోకనాథం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU); అండ్ర మాల్యాద్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS); దయా రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి, సిఐటియు; వి. కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం; ఎం. హరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం; పూసపాటి వెంకటరావు, కో-కన్వీనర్, వృత్తిదారుల సమన్వయ కమిటీ; వి. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) నూతన రాష్ట్ర కమిటీ

అధ్యక్ష–ప్రధానకార్యదర్శులుగా కె.నాగభూషణం - కె.ఉమామహేశ్వర రావు - 21 మంది ఆఫీస్ బేరర్స్ ఎన్నిక - మరో 50 మందితో రాష్ట్ర కమిటీ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా కె నాగభూషణం, కె ఉమామహేశ్వరరావు తిరిగి ఎన్నికయ్యారు.మునిసిపల్  వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 15వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు కొత్త మార్కెట్ వద్ద  జి.సుబ్బారావు నగర్‌లో నవంబర్ 15–16 తేదీల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు మున్సిపల్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చలు జరిపిన ఈ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలకు తొలి రోజు ఎంఎల్ సి బి గోపిమూర్తి, నిన్న ఈ రోజు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ముఖ్య అతిధులు గా హాజరై శ్రేణులకు దశ, దిశా నిర్దేశం చేశారు. కాగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, ఎ పి మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఎపి మధ్యాహ్న భోజన పధక కార్మికుల యూనియన్, కెవిపిఎస్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి కల్పన, బి రఘురామ్ స...

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు

అనంతపురం:  హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గమని, అప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తాయని సివిల్‌ సప్లరు హామాలీ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సప్లయ్ హమాలీ యూనియన్‌ ఐదవ రాష్ట్ర మహాసభ అనంతపురం జిల్లా కేంద్రంలోని గణేనాయక్‌ భవన్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. సీతారాం ఏచూరి ప్రాంగణంలో సిఐటియు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.కృష్ణ అధ్యక్షతన ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా గేయానంద్‌, ఆ సంఘం గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. తొలుత అమరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మహాసభ నివాళులర్పించింది. మూడు సంవత్సరాల్లో సంఘం ఆధ్వర్యంలో హమాలీల పక్షాన చేసిన పోరాటాలు, సాధించిన హక్కులు తదితర అంశాలపై ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరరావు నివేదిక ప్రవేశపెట్టారు. గేయానంద్‌, కె.ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ… సివిల్‌ సప్లరు హమాలీల శ్రమకు తగ్గ వేతనం అందడం లేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత క...