లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మిక వర్గం ఐక్య పోరాటాలు చేయాలి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ వి.గోపాల్ గౌడ పిలుపు


రాజ్యాంగ విరుద్ధమైన, కార్మిక వర్గానికి నష్ట దాయకమైన లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఆందోళనలు చేపట్టాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.గోపాల్ గౌడ సందేశమిచ్చారు. ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. డిసెంబర్ 13న విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా సిఐటియు-ఎంబివికే ఆధ్వర్యంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జస్టిస్ గోపాల్ గౌడ ప్రసంగిస్తూ వంద సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను పెట్టుబడి దారులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు బేర సారాలు ఆడే హక్కు లేకుండా లేబర్ కోడ్స్ తయారు చేశారని అన్నారు. కార్మికులకు ఎటువంటి పని, సామాజిక భద్రత భవిష్యత్తులో ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్ల సేవలో తరిస్తున్నాయన్నారు. జాతీయ కనీస వేతనం రూ. 178/- రోజుకి ఎలా సరిపోతుందన్నారు. పెరుగుతున్న ధరలు కార్మికుల్ని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. కార్మిక యూనియన్లను ఇష్టారాజ్యంగా రద్దు చేయడానికి చట్టం చేశారని, సంఘటిత శక్తి, హక్కు లేకుండా చేస్తున్నారని, కొత్త హక్కులు కల్పించకపోగా ఉన్న హక్కులు కాల రాస్తున్నారని లేబర్ కోడ్స్ మీద పార్లమెంట్లో, చట్టసభల్లో చర్చలు జరగడం లేదని, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల ప్రతినిధులు కాదని పార్టీల ప్రతినిధులని ఆయన ఎద్దేవా చేశారు. పేదల, కార్మికుల ప్రతినిధులను చట్ట సభలకు పంపితేనే సమస్యలు చర్చలకు నోచుకుంటా యన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టాన్ని పారిశ్రామిక సంబంధాలు కోడ్గా మార్చి దాంట్లో ఉన్న సారం తీసేసారని అన్నారు. వెల్ఫేర్ కోడ్ కార్మికులకు వెల్ఫేర్ లేకుండా చేస్తుందన్నారు.


రాజ్యాంగం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు భిన్నంగా లేబర్ కోడ్స్ తీసుకువచ్చారని, ఇది యాజమాన్యాల లాభాల కోసమన్నారు. సంక్షేమ బోర్డులు ఉండవని చెప్పారు. మహిళల సాధికారత గురించి ప్రభుత్వం గొప్పలు చెప్తుందని ఆచరణలో మహిళలకి సమాన పనికి సమాన హక్కు చట్టం (1976) ఈ లేబర్ కోడ్లో రద్దు చేశారన్నారు. రాత్రిపూట మహిళల్ని బలవంతంగా నైట్ షిఫ్ట్ చేయించుకోవచ్చని చట్టాలు చేశారని, పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయని, ఎనిమిది గంటల పని కోసం కార్మిక వర్గం శతాబ్ద కాలం క్రితం పోరాడి సాధించుకున్న హక్కుని లేకుండా చేస్తున్నారన్నారు. కార్మికవర్గం వల్లే ఉత్పాదకత పెరిగి దేశం అభివృద్ధి చెందుతుందని కానీ లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు బానిసలుగా మారతారని పేర్కొన్నారు. కార్మిక చట్టాలు అమలు కోసం, లేబర్కోడ్స్ రద్దు కోసం కార్మిక వర్గం సమైక్య పోరాటాలకు పూనుకోవాలన్నారు. 


సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏ. వి. నాగేశ్వరావు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు కోసం దేశవ్యాప్తంగా గత ఐదు సంవత్సరాలుగా పోరాడుతున్నామని, ఫిబ్రవరిలో కేంద్ర కార్మిక సంఘాలు సమ్మె పోరాటానికి సమర శంఖం పూరించాయన్నారు. డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్నాయని జనవరి 4న జరిగే బహిరంగ సభకు లక్షలాది మంది తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎంబీబీకే కార్యదర్శి పి.మురళీకృష్ణ మాట్లాడుతూ కార్మికులు వల్లే సమాజం అభివృద్ధి చెందిందని కార్పొరేట్ల వల్ల కాదని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని చంద్రబాబు కూటమి ప్రభుత్వం కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్నాయన్నారు. కార్మిక వర్గానికి పోరాటం తప్ప మరో మార్గం లేదని పేర్కొన్నారు. సభ ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సి. హెచ్, శ్రీనివాస్ వక్తలను వేదికపై ఆహ్వానించారు. 


అనంతరం సిఐటియు అగ్ర నాయకులు కామ్రేడ్ నండూరి ప్రసాదరావు చిత్రపటానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏ.వి. నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ.వి. గోపాల్ గౌడ పూలమాల వేసి నివాళులర్పించారు. గోపాల్ గౌడ్ గారి ప్రసంగం అనంతరం ఆయనను సిఐటియు-ఎంబివికేలు సంయుక్తంగా మెమొంటో ఇచ్చారు. మాజీ మాజీ మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు గోపాల్ గౌడ గారికి శాలువా కప్పి సత్కరించారు. ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు ధనలక్ష్మి, ముజఫర్ అహ్మద్, దయా రమాదేవి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజయ్ కుమార్, సిఐటియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఏ.వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు కె.దుర్గారావు, ఈ. వీ. నారాయణ, ఎన్. నాగేశ్వరరావు, ఎన్.సి.హెచ్.సుప్రజ, ఏ.కమల, ఐసీఇయూ మచిలీపట్నం డివిజన్ కార్యదర్శి కె. కిషోర్ కుమార్, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ సీనియర్ నాయకులు పి.అశోక్ బాబు, బాలాజీ, వి.రవికుమార్, ఏపీ ఎమ్మెస్ ఆరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) నూతన రాష్ట్ర కమిటీ

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు

సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో సిఐటియు అఖిలభారత మహాసభల కోసం ప్రచారం