సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో సిఐటియు అఖిలభారత మహాసభల కోసం ప్రచారం



సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంఘమైన ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మహాసభలు కోసం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.




ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిఐటియు అఖిలభారత మహాసభలకు 1,300 మంది ప్రతినిధులు హాజరై పాల్గొంటారు. అందులో ఆశా వర్కర్ వర్కర్స్ యూనియన్ నుండి కూడా ప్రతినిధులు దేశ నలుమూలల నుండి ఈ మహాసభకు వస్తున్నారు. ఇప్పటికే సిఐటియు అనేక కార్మిక సమస్యల కోసం పోరాడటమే కాకుండా ఆశా వర్కర్ల సమస్యలపై కూడా నిరంతరం పోరాటం చేస్తుంది. మన రాష్ట్రంలో ఇప్పటికీ ఆశా వర్కర్ల జీతం 10,000 కు మించడం లేదు. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేస్తున్న కార్మికులు ఎవరైనా ఉన్నారంటే వారు ఆశా వర్కర్లు మాత్రమే. వీరికి హెల్త్ ఇన్సూరెన్స్ లేవు. అన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఇలాంటి అనేక సమస్యల పైన ఈ మహాసభలు చర్చించి భవిష్యత్తు పోరాటాలకు దిశా నిర్దేశం చేయనుంది. కావున ఈ మహాసభలను జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఆశా కార్యకర్త పైన ఉన్నది. ఆశా కార్యకర్తలు, వారు పనిచేసే పిహెచ్సీలలో ఉన్న సిబ్బందిని కూడా ఈ మహాసభలకు ఆహ్వానిస్తూ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆఫీసు బేరర్స్ అందరూ సంయుక్తంగా సెల్ఫ్ వీడియోలతో ప్రచారం ప్రారంభించారు. వారి గ్రూపుల్లో పిహెచ్సీలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. మహాసభలు ముగింపు సందర్భంగా 2026 జనవరి 4న జరగబోయే మహా ప్రదర్శన, బహిరంగ సభలో ఆశా వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆశా వర్కర్లు పీహెచ్సీ సిబ్బంది కూడా ఈ మహాసభ జయప్రదానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.రమణకుమారి, కోశాధికారి ఏ.కమల, ఉపాధ్యక్షులు వి.సుధారాణి, వి.సత్యవతి, బి. అన్నపూర్ణ, పి.ధనశ్రీ, కె. కల్పన, ఎన్.పద్మ, ఎం.నాగమణి, కార్యదర్శులు పోశమ్మ, వాణిశ్రీ, కె. లక్ష్మి పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) నూతన రాష్ట్ర కమిటీ

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు